5:34 AM
0

                                                                     నేనెవరు?

               ఈగ ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన కథ అందరికీ  తెలుసు. పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ,ఒక అన్వేషణగా సాగి ,పేరు మళ్లీ గుర్తుకుతెచ్చుకోవడంతో ముగుస్తుంది .
మానవుని కథాఅంతే. ఈగ ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయినట్టు,లౌకికవ్యవహారాలలో పడి,మానవుడు తాను ఎవరైనదీ మరచిపోతున్నాడు. “నేనెవరు?” అని ప్రశ్నించుకొని,సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు. ఆ అన్వేషణే ఆధ్యాత్మిక సాధన. మానవుని చరిత్ర.  
చిన్నతనంలో తరతమ బేధాలు తెలియవు. ఆ అమాయకత్వం అమూల్యమైనది. పెద్దయ్యాక ‘సామజిక స్పృహ’ ఏర్పడుతుంది. అంతరాలు,అభిప్రాయాలు ఏర్పడి నామరూపాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ సామాజిక స్పృహ  కొన్నాళ్ళకు నిస్పృహ కలిగిస్తుంది.దానికి తోడు చేసే పనే కాదు,తీరిక సమయంలో చేసే కాలక్షేపం కూడా యాంత్రికం అయిపోవడం. దీనివల్ల అర్థాన్ని గడిస్తున్నా, బ్రతుకు అర్ధశూన్యంగానే వుందే అనిపిస్తోంది.
ఈ నిస్పృహ నుండి బయటపడి జీవితం పట్ల ఆసక్తీ,ఉత్సాహం ఏర్పడాలంటే సమాజాన్ని, పరిస్థితుల్ని దాటి చూడాలి. అత్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ఇందుకు సంస్కృతి సహకరిస్తుంది.

                                     1

శివుడు ఆత్మ స్వరూపుడు . అందువల్ల శివుడి లక్షణాలనే ఆత్మ లక్షణాలుగా గుర్తించవచ్చు.
శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు.
శివుడికి స్వపరబేధం లేదు. ఆయన అందర్నీ ఒక్కలాగే చూస్తాడు .రాక్షసులైనా వారు చేసిన తపస్సు ఫలిస్తే, కోరింది ఇస్తాడు .
శివుడు అమృతాన్ని విషాన్ని వేరుగా చూడడు . సత్ప్రయోజనం కోసం అవసరమైతే విషం పుచ్చుకుంటాడు.
ఈశ్వరుడు సంసారాన్ని, సన్యాసాన్ని విడగొట్టడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చి బూడిద చేసినవాడే ,పార్వతిని వివాహమాడి సంసారి అయ్యాడు. మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈ భిన్న తత్వాల వెనక ఉన్న ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం . ఈ తత్వాన్నే సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు, ‘సంసార సాగరం నాదే ,సన్యాసం శూన్యం నావేలే’ అని తన ‘జగమంత కుటుంబం’పాటలో వ్యక్తం చేసారు
శివుడు జననాన్ని ,మరణాన్ని వేరుగా చూడడు . కాబట్టే ఆయనకు జననమరణాలు లేవు . మృత్యుంజయుడు .
శివుడికి నామరూపాలకు అతీతుడు  . అందుకే ఆయన లింగరూపంలో వున్నాడు .
శివుడికి మూడోకన్ను(జ్ఞాననేత్రం) ఉంది.అందువల్ల ఆయనకు తన్ను గూర్చిన జ్ఞానం(ఆత్మజ్ఞానం) ఉంది .                                                                                 


శివపార్వతుల  వివాహ ఘట్టాన్ని పరిశీలిస్తే, మన్మధుడు,పార్వతి కలిసి శివుడికి తపోభంగం కలిగించి,శివుడి ఆగ్రహానికి గురై ,మన్మధుడు ప్రాణాల్ని ,పార్వతి శివుడి విశ్వాసాన్ని కోల్పోయారు.శివుడే ఆత్మ కాబట్టి శివుడి విశ్వాసాన్ని కోల్పోవడమంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడమే . ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన పార్వతి అందుకోసం తపస్సు చేసింది . ఆత్మవిశ్వాసం కోసం ప్రయత్నించడం ఒక తపస్సు . తపస్సు ద్వారా పార్వతి ఆత్మ(శివుడి)విశ్వాసాన్ని తిరిగి పొందింది . శివుడి సాక్షాత్కారం అంటే ఆత్మసాక్షాత్కారం పొందింది . శివపార్వతులు ఒక్కటయ్యారు . శివుడి శరీరం పార్వతి(ప్రకృతి)ఐతే ,పార్వతి ఆత్మ శివుడు(పురుషుడు). శివపార్వతుల,ప్రకృతిపురుషుల,దేహాత్మల ఐక్యరూపమే వ్యక్తి . అందువల్ల దేహాభిమానంతో సంసారంలో ఉన్నా,ఆత్మాభిమానంతో సన్యాసంలో ఉన్నా,దేహాత్మలను ఒకటిగా చూస్తూ వాటి మధ్య ఐక్యత సాధించడం ముఖ్యం .ఐక్యత లోపిస్తే ‘వ్యక్తి’త్వం లోపిస్తుంది .  అర్ధనారీశ్వర తత్వంలో వ్యక్తిత్వం ఉన్నది .  
శివపార్వతులిద్దరూ తపస్సు ద్వారానే ఒక్కటయ్యారు . తొలిచూపు ప్రేమలో (love at first sight ) శివుడికి నమ్మకం లేదు. అందుకే మొదట మన్మధుని జోక్యాన్ని,  పార్వతిని తిరస్కరించాడు . తపస్సు ద్వారా ఒకరి విశ్వాసాన్ని మరొకరు చూరగొన్న తర్వాతనే వారు వివాహం చేసుకుని అదిదంపతులయ్యారు. నేటి ప్రేమలో ఈ తపస్సు ,విశ్వాసం లోపించి, మన్మధుని జోక్యం ఉంటోందని , కొన్ని రాజకీయ పార్టీలు ‘ప్రేమికుల రోజు’ ను బహిష్కరిస్తున్నాయి .  
శివుడు తన దేహాన్ని (ప్రకృతిని) ఆలిగా చేసుకున్నాడు . ఈ దృష్టి తోనే శాస్త్రి గారు ‘నా హృదయమే నాకు ఆలి’ అన్నారు తన ‘జగమంతకుటుంబం’ పాటలో. (ఈ పాట పై  విశ్లేషణను  4 వ పేజీ లో చూడవచ్చు)

                                         2

        శివపార్వతుల (దేహత్మల) కలయికే వ్యక్తి . ఆ వ్యక్తి విష్ణుమూర్తి అనుకుంటే , విష్ణువుకు నిశ్చితరూపం లేదు. ఆయన ఆకాశంలో పక్షిగా,నీటిలో చేపగా, ఇలా పరిస్థితిని బట్టి అవతారాన్ని మారుస్తూ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాడు. అలా ,మానవునితో సహా అన్ని జీవులూ ఆయన అవతారాలే అయినపుడు నేను ఎవరిని?. మానవుణ్ణా! మాధవుణ్ణా!. మానవుణ్ణి అనుకుంటే నేనొక రూపానికి నామానికి పరిమితుణ్నవుతున్నాను. ఇది బంధం. మాధవుణ్ని అనుకుంటే నేను అపరిమితుణ్ని. అన్ని రూపాలు నావే. ఇది స్వేఛ్చ. అన్నిరూపాలు నావే నంటూ సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు,జగమంతకుటుంబం పాటలో “కవినై ,కవితనై ,భార్యనై భర్తనై ,రవినై శశినై ,దివమై నిశినై ,నాతో నేను సహగమిస్తూ …” అంటూ తన అపరిమితత్వాన్ని,స్వేచ్ఛను వ్యక్తం చేసారు . ఆ పాటలోనే ఒంటరితనాన్ని,ఏకాకిజీవితాన్ని(ఏకాంతాన్ని) ప్రస్తావించారు . అన్ని రూపాల్లో ఉన్నది నేనే అయినప్పుడు ఉన్నది నేనొక్కడినే .అందువల్ల నేను ఒంటరిని . ఏకాకిని.అన్ని రూపాలూ నావే కనుక నాది జగమంత కుటుంబం .
అంతా నేనే అయినపుడు,ఇతరులను హింసించడమంటే, నన్ను నేను హింసించుకోవడమే అవుతుంది .
                   

                                                        3

సృష్టి చేయాలంటే సృజనాత్మక శక్తి (బ్రహ్మ) కావాలి . విష్ణువు లోనే బ్రహ్మ ఉన్నాడు. ఆయనలోంచే పుట్టాడు(వ్యక్తం అయ్యాడు). అందువల్ల విష్ణువు తన్ను తాను పునఃసృష్టిoచుకుంటూ పరిస్థితిని బట్టి  అవతారాన్ని మారుస్తున్నాడు .  
ఇపుడు , “నేనెవరు?”, అని మానవుడు ప్రశ్నించుకుంటే,
దేహత్మలు ఉన్నందున అతడు శివుడా ?
మానవరూపంలో ఉన్న విష్ణువా ?
తనను తాను పునఃసృస్టించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగలడు కాబట్టి బ్రహ్మా?
త్రిమూర్తులు ముగ్గురు లేరు . ముగ్గురూ ఒక్కరిలోనే ఉన్నారు . ఆయనే పరబ్రహ్మ . బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ స్వరూపాలు .
ఫై ముగ్గురూ మానవుని ఆశ్రయించుకొని వున్నారు కాబట్టి నేను(అహం) ఎవరు ?

                         ‘ అహం బ్రహ్మాస్మి’

                   ఈ వేదాంత మహావాక్యంలోని  బ్రహ్మ, పరబ్రహ్మ.
శివుడికున్న మూడోనేత్రం(జ్ఞాననేత్రం) తనకూ వుంది కాబట్టి మానవుడు తాను పరబ్రహ్మ స్వరూపుణ్నని గుర్తించగలడు.  

                                             ************

(మానవుడు ప్రేమికుడుగా,భావుకుడుగా,భక్తుడుగా ఉన్నపుడు పాడుకోవడంకోసం ప్రేమగీతాలు, భావగీతాలు,భక్తిగీతాలు చాలానే వున్నాయి. కానీ మానవుడు మాధవుడిగా ఉన్నపుడు పాడుకునే భగవద్గీత లాంటి పాట శ్రీ  సిరివెన్నల సీతారామశాస్త్రి  గారి "జగమంతకుటుంబం నాది" .శంకరుల అద్వైత దృక్పధంలో సాగిన  ఆ పాటపై ఓ  విశ్లేషణ తరువాత పేజీలలో ..... )     
                                                                                                                                                                                                                                                                                                                                                     




                                 
                               జగమంతకుటుంబం                                                                               
                                        పాట
                                   పల్లవి   :  జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది
                                                 సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే
                                   చరణం :  కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై
                                                 మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో
                                                 పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల
                                                 నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ
                                                 ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
                                                 కలల్ని,కథల్ని ,మాటల్ని ,  పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని
                                                 కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని                                  //జగమంత//
శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు . కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్ఛిన ఘనత ఆయనదే .
                                               1+1  ×  1-1      =       1
                                                 రెండు                ఒకటి
                              ( X+1 ×  X-1)+1   ×  ( 1 )-1   =     1

పై సమీకరణంలో 1 రెండుగా (1+1  ×  1-1) విడిపోయింది . రెండిట్లో ఒకటి (1+1) తిరిగి, క్రింది సమీకరణంలో , రెండుగా అనేకం(X+1 ×  X-1) గా మారిపోయింది . (X) స్థానంలో సంఖ్యనైనా ప్రతిక్షేపించుకోవచ్చు .సృష్టిలో ఉన్నది ఒకటే నని అదే రెండుగా అనేకంగా మారిపోయిందని అద్వైత తత్వసారాంశం ఈ తత్వానికి ఆదిశంకరాచార్యలు ఆద్యులు.ఈ అద్వైత తత్వానికి ఫై సమీకరణం 'skeleton' అయితే దానికి రక్త మాంసాలు కల్పించి ప్రాణం పోసింది శాస్త్రి గారి పాట. నవరసాలకు మూలమైన తత్వం ఈ పాటలో ఉంది .
                        
                                  ( X+1 ×  X-1)+1  ×     ( 1 )-1          =         1
                                జగమంతకుటుంబం      ఏకాకిజీవితం         నేను(నాది)

జగమంతకుటుంబం :   (X+1 ×  X-1) లో  X  బదులుగా (కవి ×కవిత),(భర్త  ×  భార్య),(భగవంతుడు × భక్తుడు) ....ఇలా ఒకరికొకరు వరసైన జంటలను ఎన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. కానీ ఏవరసకావరసే.తమ్ముడు తమ్ముడే  పేకాట పేకాటే, ఏమాటకామాటే .  ఒక  వరస పనిచ్తేస్తున్న సమయంలో రెండోది పనిచెయ్యదు . అలా వరసకు వరసను , రసానికి రసాన్ని విడివిడిగా గుర్తించడమే సామరస్యం .
                         

                                           (2+1  ×   3-1)   ≠ 1

                                       
                             ఫై సమీకరణంలో 2 వేరు ,3 వేరు . అందువల్ల అవి ఒకటి కాలేదు (≠ 1) అలాగే మనిషి మాటలకు చేతలకు పొంతన లేకపోతే అతడువ్యక్తికాలేడు . ‘వ్యక్తిత్వ లోపం  వంచనకు,ఆత్మవంచనకు,సంఘర్షణకు దారితీస్తుంది . ఐక్యమత్యమే బలం అన్నట్టు మనస్సు,వాక్కు,కర్మ మూడింటికి పొంతన కుదిరి ఐక్యం (ఒకటి)గా ఉంటేనే నైతిక బలం సిద్దిస్తుంది. మనోవాక్కయకర్మలలో  ఏకత్వమే చిత్తశుద్ది ,నిజాయితీ.

                                                 2 +1  ×  2 –1    =  1
                                                 3 +1  ×  3 –1    =  1

            ఫై సమీకరణాలురెండింటిలోనూ ఏకత్వం ,ఒకటి( 1) ఉంది .కానీ రెండుసమీకరణాలు ఒకలా లేవు . భిన్నంగా ఉన్నాయి . ​ అలాగే ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు . ఉదాహరణకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.వీరిద్దరిలోను, ఫై సమీకరణాల్లో లాగే ఏకత్వం-మనోవాక్కయకర్మలలో ఏకత్వం ​-ఉంది . కానీ  ఇద్దరి   జీవితమార్గాలు  ఒకలాలేవు .  విలక్షణంగా ఉన్నాయి. కారణం వారు ఏకత్వానికి ,చిత్తశుద్దికి ప్రాధాన్యత యిచ్చి,అలావుండడానికి నిరంతర  సాధన  చెయ్యడం వల్ల ఆసాధన ఫలితం ఒక విలక్షణ జీవితవిధానంగా  దానంతట అదే రూపుదిద్దుకుంది . విలక్షణత అంతవరకు కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయాన్ని సమర్ధించవచ్చు ,లేదా వ్యతిరేకించవచ్చు . అలాకాకుండా ముందే ఏదో ఒక జీవితవిధానాన్ని ఆదర్శంగా పెట్టుకుని తదనుగుణంగా జీవించడం మొదలుపెడితే అది స్వభావానికి,పరిస్థితులకు విరుద్ధమై , మనోవాక్కయకర్మలలో  ఏకత్వాన్ని (integrity)పోగొట్టి  అస్థిత్వాన్నే భంగపరుస్తుంది .అస్తిత్వంతో ఉండడమంటే ఏకత్వంతో ఉండడమే .అప్పుడే వ్యక్తిత్వము,విలువలు ,స్వేఛ్చ సిద్ధిస్తాయి .

ఏకాకిజీవితం : ‘జగమంతకుటుంబం నాది ​​అనుకునేవాడికి ఏకాకిజీవితం తప్పదు . ఎందుకంటే అతడు   వర్గంలోను,వ్యవస్థలోను,వ్యక్తులతోను చేరడు . కాబట్టి అతడు ఏకాకి, సన్యాసి. ఎందులోనూ చేరడు కాబట్టే అందర్నీ కలుపుకుపోగలడు . అందువల్ల అతనిది జగమంతకుటుంబం ,సంసారసాగరం .
నేను (సృష్టికర్త ): సంక్షిప్త రూపం లో ఉన్న 1  విస్తృత రూపం దాల్చి (X+1 ×  X-1)అయినట్లు , సూక్ష్మరూపంలో వుండే విత్తనం స్థూలరూపం పొంది వృక్షం అవుతున్నట్టు ,ఏకాకిగా వున్న 'నేను' ఇంతితై వటుడింతయై అన్నట్టు విశ్వమంత అయ్యాను . ఏకాకియైన శ్రీకృష్ణుడు ,తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు .
                     ​
                    1 లో ( X+1 ×  X-1)వున్నట్టు ,విత్తనంలో వృక్షం దాగి వున్నట్టు , ఏకాకి లో విశ్వం ఇమిడి  వుంది . ఏకాకి ఐన శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తనలోనే (నోట్లోనే ) విశ్వాన్ని చూపించాడు .
                            విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation)కనుక జగమంతకుటుంబం నాది . విశ్వం నాలో లీనం (లయం ) అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితం నాది . ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం. భిన్నత్వంలో ఏకత్వం ఏకాకిజీవితం.
                            ఏకాకిగా వున్నసృష్టికర్త కవిగా ,కవితగా ,భార్యగా ,భర్తగా ............సృష్టిగా మారి జగమంత అయ్యాడు . మట్టి, కుండగా మారినట్టు సృష్టికర్తే సృష్టిగా మారాడు . మాధవుడే మానవుడయ్యాడు . నరనారాయణులు ఒక్కరే . నరుడే నారాయణుడు .
                        నరుడు ప్రేమికుడిగా,భావుకుడిగా ,భక్తుడిగా  ఉన్నపుడు పాడుకోవడానికి  ప్రేమగీతాల్ని, భావగీతాల్ని,భక్తిగీతాల్ని ఇంతవరకు కవులందరూ వ్రాసారు . కానీ నరుడు నారాయణుడిగా వున్నపుడు పాడుకునే భగవద్ గీత శాస్త్రి గారి 'జగమంతకుటుంబం'
                            ఉన్నది ఒకటే నని ,రెండుగా కనిపిస్తున్నవన్నీ ఒకే దానికున్న రెండు పార్శ్వాలని  అద్వైతతత్వ సారాంశం . మనిషి పార్శ్వంలో ఉన్నా,జ్ఞాననేత్రంతో రెండో పార్శ్వం యొక్క ఉనికిని ,దాని విలువను గుర్తించగలడు .

0 comments:

Post a Comment

Live Cricket

Archive