10:24 PM
0

అమ్మవారి ఏడోరూపం పేరు వసుంధర (భూదేవి).

ఆ తల్లి ఒళ్ళో భద్రంగా ఉన్నాం మనం. అమ్మ ఒళ్ళో ఉండి కూడా అమ్మను గుర్తించనంత అజ్ఞానంలో ఉన్నాం. భారతీయుడిగా పుట్టిన ప్రతీవాడూ ఉదయం నిద్రలేస్తూనే కాలు నేలమీద పెట్టబోయే ముందు "సముద్రవసనే దేవీ పర్వతస్తన మండలే విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమాం" - "విష్ణుపత్ని అయిన వసుంధరా! నీ మీద పాదం మోపుతున్నందుకు క్షమించమ్మా!" అని నమస్కరిస్తాడు.
’ప్రధానాంశ స్వరూపా సా ప్రకృతైశ్చ వసుంధరా ఆధారరూపా సర్వేషాం’ - సర్వజగత్తుకూ ఆధారమైన తల్లి భూదేవి. ’సర్వశస్యా ప్రకీర్తితా రత్నాకరా రత్నగర్భా సర్వరత్నాకరాశ్రయా’ - కొన్నిచోట్ల సస్యములు ఇస్తుంది, కొన్నిచోట్ల రాళ్ళు ఇస్తుంది. "అశ్మాచ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే..." అని వర్ణిస్తోంది రుద్రం. ఇలాగ ఆ పరమేశ్వరుని యొక్క శక్తి అయిన పరమేశ్వరి వసుంధరా రూపంలో ఎన్నివిధాలగానో ఆదుకుంటుంది. నదీ నదాలు, వాగులు-వంకలు, సముద్రం...ఇవన్నీ వసుంధరా స్వరూపాలే. మనం సస్యములు పండించడానికి ఆ నేలలో అక్కడ శక్తి పెట్టినదీ అమ్మే. మనల్ని పోషించడానికి ఇంత పెద్ద పృథురూపంతో ఉన పృథ్వి ఇది. అమ్మ -’రత్నాకరా రత్నగర్భా’ - అనేక రత్నాలను వెలికి ప్రసరింపచేస్తున్నటువంటి తల్లి. ’ప్రజాభిశ్చ ప్రజేషైశ్చ పూజితా వందితా సదా...’ - సర్వ ప్రజల చేతా, ప్రజేశుల చేతా ఆరాధింపబడుతూ ’సర్వోపజిత్యరూపా చ’ - అందరికీ జీవనాన్నిచ్చే తల్లిట. ఎవరు బ్రతికినా ఈ తల్లివల్లే బ్రతుకుతారు, ఈ తల్లిమీదే బ్రతుకుతారు, ఈ తల్లివల్లనే బ్రతుకుతున్నారు. అందుకే ’సర్వజీవః స్వరూపా చ సర్వ సంపత్ విధాయినీ యయా బినా జగత్సర్వం నిరాధారం చరాచరం...’ఈ తల్లి గనుక లేకపోతే జగత్తంతా నిరాధారమే.
’వసు’ అంటే సంపదలు అని అర్థం. ’వసుంధర’ అంటే సంపదలను ధరించునది అని అర్థం. భూశక్తి అంతా అమ్మవారు అని వివరించడం జరిగింది. భూశక్తి అంటే కేవలం మనం చూసే భూమి మాత్రమే కాదు. ఏలోకానికి వెళ్ళినా భూమి ఉంటుంది. భూమి అంటే అక్కడ ఉన్న ఆధారశక్తి. ఆ ఆధారశక్తే అమ్మ స్వరూపం. ఆ ఆధారమే లేకపోతే ఏ జీవీ ఎక్కడా నిలబడలేదు, కూర్చోలేదు. జీవిని నిలబెట్టేశక్తి, ఆధారశక్తి, ఈ పృథ్వి జగజ్జనని.

                                                             www.telugupeopls.blogspot.in

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive